Tuesday, February 3, 2015

రామాయణం

రామాయణం  

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మొత్తం 42 రోజుల్లో ఈ రామాయణ ప్రవచనాన్ని కాకినాడలో చెప్పారు.




రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, 

కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలానంతటిని పరిపాలిస్తాను అని. 

రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.



అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి. 



యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ 

బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.



ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.



రామ అంటే లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి. 



కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్



రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.









బాలకాండ

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. 



చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలో  రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటే , తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........


ఇక్ష్వాకువంశములో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలో సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటే బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటే లక్ష్మీ దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటే లక్ష్మీ తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.  








రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటే  = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలో  రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలో
 ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.


అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలో విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.

వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........

తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు.

కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.








అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.......అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు......యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.

చైత్ర మాసంలో  చిత్రా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే  ఫాల్గుణ మాసంలో వచ్చే
అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 


సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||

పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిధి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు....

వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |
అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||

అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ "ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.

ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలో 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, ఛండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతో  ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.

మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులో బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినే అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు.

దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి....ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.......

తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

ఆ యిష్టి జరుగుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్లి, " పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు.....

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు " నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు" అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు....

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో, అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు......

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.

అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు " నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.








తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్ష్ త్రే  అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలో, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయకి పుష్యమి నక్షత్రంలో, మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ గారు దేవతలతో ఒక సభ తీర్చారు......" శ్రీమహా విష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు, రావణసంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి" అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.

అప్పుడు బ్రహ్మ " ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి" అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతో నీలుడు జన్మించాడు, వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.

అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం ||
సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా |
వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా ||

రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటే అగ్ని బీజం, మ అంటే  అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మీ) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.

తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో  వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.

అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు " నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు " దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి" అన్నాడు.

స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం |
కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి ||

నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా, మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను, అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.

ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః |
న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః ||

మెల్లగా తేరుకొన్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడ, కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే, రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.

రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు.

అప్పుడు దశరథుడు " లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు " అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, " చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు" అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు " ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావ? ఇచ్చిన మాటకి  నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా......

ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం ||

ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు" అని అన్నాడు.

దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు.




విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతో  వెళితే ఎలా ఉంటుందో, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితే ఎలా ఉంటుందో, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు.

అప్పుడు విశ్వామిత్రుడు......
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||

బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.

విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని......
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.

రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో " అని చెప్పాడు.

మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు '' ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదే సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు". అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.

అలా వాళ్ళు వెళుతుంటే అక్కడున్న అరణ్యంలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు " పూర్వము ఇక్కడ మలదము, కరూషము
అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు" అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.

అలాగే పూర్వ కాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతో, అరణ్యంలో ఇష్టమొచ్చినట్టు తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ' నీకు వికృతరూపంవచ్చుగాక ' అని, మారీచుడిని ' ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ' శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు " అని విశ్వామిత్రుడు అన్నాడు.

అప్పుడు రాముడు.......
పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |
వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||
గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |
తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||

"మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను" అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా " అన్నాడు.

ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతో రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని, క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.

మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో....... మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతో ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే " అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.

ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు, ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.

మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.



అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, " మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి " అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది, శోణానది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.

కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో.........

కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||
మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

మాదగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.

తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...............

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||

స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటే  ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు.

అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు.







అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు" అన్నాడు.

నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.

స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||

అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని రాముడితో చెప్పాడు.

అక్కడే ఉన్న ఋషులు అప్పుడు.........

విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||

నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు.

అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలో  ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.

మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |

మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.

శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.

అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.

తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||

ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....

ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||

తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.
కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||

ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.

ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.




ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు " పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. 

శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళి ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళి చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.

అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |
ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||
షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |
అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||

అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడు సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.

కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది.........నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు సౌచంగా( భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు.

దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు. దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.







ఒక రోజు, మిట్ట మధ్యాహ్నం వేళ, దితి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది, అప్పుడామె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది, ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని అనింది. అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు.

రామా! ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుడికి సృంజయుసుడు, సృంజయుసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు, ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు.

తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొన్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, సూర్యచంద్రులులాగ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులంటారు, దశరథుని కుమారులు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి, కుశల ప్రశ్నలు అడిగాక అక్కడినుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది, కాని అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పెను......
గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః ||

ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన, ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు.

ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ ||

అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో సంగమించింది.

అహల్య ఇంద్రుడితో ఇలా అనింది " నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను, నువ్వు ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో " అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే......
గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం ||

దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపఃశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు " నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవు గాక " అని ఇంద్రుడిని శపించారు.
పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |

అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు " నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమి చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను, ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను, అహల్యని శపించడం వల్ల కొంత తపఃశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను, కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణములను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమం లోకి వెళ్ళగానే, ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు.




తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునేవాళ్ళతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌవరంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు, ఖడ్గాలు, కొదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు, ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకి వాళ్ళు ఎవరు అని అడిగారు.

వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయ్యింది అని విశ్వామిత్రుడు చెప్పాడు.

అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశార అని శతానందుడు వాళ్ళని అడిగాడు.

పతితపావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాపవిమోచనం అయ్యింది, ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు.

శతానందుడు ఎంతో సంతోషించాడు......... "రామ! నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావ. మా అమ్మ సంతోషంగా ఉందా " అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు.....మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళారు అని చెప్పాడు.

రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు.......
న అస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కశ్చన |
గోప్తా కుశిక పుత్రః తే యేన తప్తం మహత్ తపః ||

" విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు, ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను " అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు.


శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు " గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్నవశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది, అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.

అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో......అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.

సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు.......నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా ( రాజధర్మం అంటే, ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నార అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు.........

సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |
రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||

ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాలన్నాడు.

మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడన్నాడు.

అప్పుడు వశిష్ఠ మహర్షి శబళని పిలిచి, చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.

శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు, మళ్ళి మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తరక్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో........

గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |

నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి అన్నాడు.

అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబళని ఇవ్వలేను అన్నారు.

విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, ...........రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు.

నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు.





అప్పుడు విశ్వామిత్రుడు,........నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులనిఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడను అన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటే ఆ శబళ ఏడ్చింది. ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ........ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడ, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడ, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.
అప్పుడు వశిష్ఠుడు.......
న త్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |
ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః ||

శబళా! నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలో వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు.

అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు.
అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటుయవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో........చూశార! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు.
అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకుపాల నుండిహారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.
కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా "ఆ......" అని హుంకారం చేశారు, ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.

ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే, ఆయన "ఆ...." అంటే వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్తఅస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.




హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడుప్రత్యక్షమై,......నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు.......
యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |
సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||


మహాదేవ! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తధాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.

ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటే అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. 
మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.

తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం,కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనేకంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు. 
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.


ఇక తనదగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు 
విశ్వామిత్రుడు.........
ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం | 
ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||

ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు,దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు " నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు " అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.





అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. 

కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కుమారులు.


అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చణ్డాలుడివి అవుతావని శపించారు.



మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుమ ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 



వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి.......మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. 



ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటే, వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, 



అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చణ్డాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు. 



విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని శపించాడు. 



అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితో త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన.......



త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||



త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని, తలక్రిందులుగా కిందకిపో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతు ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.

మహానుభావ! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటే మాత్రం ఇలా వేరె స్వర్గాన్ని సృష్టిస్తావ, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనస్సాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు.




పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. 

ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు " పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు " నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామఅవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి " అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.

కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |

అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు........
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||

మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశేపుడితో.........నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. 


ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.

కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.

మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటే మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా 

ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి. 

సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |
అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||

పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.





ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలనిగెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.

మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.

మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....

యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||

నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.

విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. 


ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.

ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.

బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.

రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.



జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు.......వీళ్ళ ఇద్దరికీ నీ దగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు. 

పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.

ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా( అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలో(పెద్ద పెట్టెలో) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహవంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.

అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||


అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహిఅని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.

ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భూమిని తవ్వి దానిని నీళ్ళతో 

నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.

అప్పుడు జనకుడు " ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను" అన్నాడు.








ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు. 

ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు.
ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.

ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |
తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.

భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||

అప్పుడు జనకుడు " మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది " అన్నాడు.

అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. 

వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. 

మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.

వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, " మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు.

వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.

దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.

ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చినభరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి,మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.




మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు " మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు.

అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు........
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకిసూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని ( గరము అంటే విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షిభస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు( ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్ఠుడు చెప్పాడు.

ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు " మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి( ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకిదేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికిమహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మఅయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని జనకుడు చెప్పుకున్నాడు.

సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక.......
వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం |
ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః ||

నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.

నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.

దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.

దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.
మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు.

అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహొత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహొత్రం దగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహొత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు..................
ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||

రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకనిధర్మపత్నిగా స్వీకరించు రామ. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]







అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు.
అలా వివాహం జరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజూ జరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.
మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.
అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు.
ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి.......
మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు " పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను " అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. " నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను " అన్నాడు.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు " రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండదు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను " అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు(తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.
దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.
సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు..........
ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి |
గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే ||
రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట.

సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట.
అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది..................
....






దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.

దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే.....

తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||

రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు( ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము), ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైన కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు(అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు(మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, 


కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే......

ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||

గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.

ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి.






ఒకనాడు దశరథుడు,..........నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు(తోకచుక్కలు, 
గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు..........

ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం |
పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా ||


ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.

అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా " దశరథ మహారాజా! మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని, ఏనుగు మీద ఎక్కి, తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి." అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నటుగా ఉంది.

ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి, వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేంటంటే.........." కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చుసుకుంటూ, ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవ్వాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే, మీలో ఒక్కరు కూడా.......దశరథా! ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చుసుకున్నావు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా, నా పాలనలో లోపాలు కనబడ్డాయ, నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయ, రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి " అని అన్నాడు.

అప్పుడు వాళ్ళందరూ...............
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః |
సాక్ష్హాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ||

" ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకి సత్యము-ధర్మము కావాలి, అన్నిటికీమించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు " అన్నారు.

అలాగే, రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది, భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది, ఇంద్రుడికిఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము.

అలాగే, " రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే, లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు, ఆయన స్నానం చేసి వెంటనే ఎనుగో, రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి, ముందు ఆయనే పలకరించి, కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటిముందు నుంచి వెళుతూ, కనపడ్డ వాళ్ళందరిని ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు. అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది, అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి " అని అన్నారు.

అలాగే, " ప్రజలు సుఖంగా ఉంటే, తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు (ప్రేమ అంటే = తాను అనుభవించక పోయినా, తనవారు అనుభవిస్తుంటే, వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం). ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి పోయినా కాని, రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమితెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, 

రాముడికి ఏమికానటువంటి వాళ్ళు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ " అన్నారు వాళ్ళందరూ. 

వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు.





ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి..........
" మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, వేశ్యలు అలంకరించుకొని రావాలి, వాళ్ళు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి, అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడువైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి " అని అన్నాడు.

సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది.

అప్పుడు దశరథుడు......." రామ! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను......నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనన్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియుక్రోధము. (కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములని వేరొకరి దగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది, అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు.

అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళి తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు " నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే, మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసేయ్యని. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయినా యుధాజిత్ దగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి, నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి, దర్భల(గడ్డి) మీద పడుకో " అని చెప్పి పంపించాడు.

దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు.

రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు( ఉపవాసం అంటే, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాధ్విక ఆహరం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు).

అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది.







ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు, అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది.

ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు.

అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర(పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో " ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి " అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి " కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా " అనింది. వెంటనే మంథర కైకేయి దగ్గరకి వెళ్ళింది.

ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది.............
అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం |
రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి ||
" నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా " అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది......

" అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో " అని ఒక బహుమతిని ఇచ్చింది.



కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది.........
" మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు." అనింది.

"చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు " అని కైకేయ అనింది.

అప్పుడు మంథర " పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |

ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||

ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి " అని మంథర కైకేయతో అనింది.

మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో......" నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు " అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే..................
అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||

" ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు " అని చెప్పింది.

"మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది " అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర.............

" ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలోతిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు." అని చెప్పింది.

ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో " ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి " అనింది. అప్పుడా మంథర..............నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.






అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానె ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు..........

" కైకేయ, నీకు ఎమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను.

అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |

దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||

ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైక. నీ కోరికెంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను " అన్నాడు.

నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది.

అప్పుడు దశరథుడు " ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను " అన్నాడు. అప్పుడా కైక..............

" రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా!, పగటి దేవతలారా!, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులార, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని......

అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః |

అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |

నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||

" ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి " అని అనింది.
(త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమనింది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)

అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు..................

" ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైక, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.

రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన్న భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.

ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, నాన్న! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.





కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది " ఏమయ్యా! ఇక్ష్వాకువంశములో జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.

నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.

దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అనింది.

అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను " అన్నాడు.

అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో......
" రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను " అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది.............

త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |
మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||

" సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా " అని అడిగింది.

అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలీనా కైకేయ ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన........
" ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగె ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగె ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటే నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయని చూస్తూ ఉండలేను, కాబట్టి నువ్వు తొందరగా తెలవారిపో " అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.

మెల్లగా తెల్లవారుతోంది..........................

అప్పుడు కైకేయ " ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను " అని అనింది.
అప్పుడు దశరథుడు.............
యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||

" నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు " అన్నాడు.

అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఎమిటని సుమంత్రుడు కైకేయని అడుగగా.............

" ఏమిలేదయ్య సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా " అనింది కైకేయ.

అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయ్యబోగా, " రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా " అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు.

ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు.........

" అమ్మ! నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఎమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లి " అన్నాడు.

అప్పుడు కైకేయ " ఎంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళి సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామ, నీకు చెప్తాను " అనింది.

ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు "ఛి" అని తలవంచుకున్నాడు.

అప్పుడు రాముడు.....
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
" అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను " అన్నాడు.

అప్పుడు కైకేయ " ఏమిలేదు రామ, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు " అనింది.

అప్పుడు రాముడు " నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,

అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |
హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||

భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను " అన్నాడు.

అప్పుడు కైకేయ " రామ! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి " అనింది.

అప్పుడు రాముడు....

న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |
విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||
" అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకుపితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావ అమ్మ, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను " అన్నాడు.

ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్తత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.

కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.......






అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి " నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు " అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది.
అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో " అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను " అని రాముడన్నాడు.
ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది.

తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది " రామ, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరె బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామ, నీకొక నిజం చెప్తాను,

న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే |

అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా ||

నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం 

అయ్యాయని అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను " అని కౌసల్య అనింది. 

ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో " అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు " అని అన్నాడు.

లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది " రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు " అని కౌసల్య అనింది.

అప్పుడు రాముడు " అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు.పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి " అన్నాడు.

తరువాత లక్ష్మణుడితో,

తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం |

విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం |
మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ |
అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||
" లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బంగిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది.

ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం |

ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం ||
ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |

పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః ||
అమ్మ, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము.
ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ||
లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది.

( అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[ శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటే కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ( కైకెయ) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా......

సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ |
యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ||
సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు.

రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు.

అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు.

" సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది.

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |

స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః ||
అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది.

భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |

భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |
అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ ||
ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ" అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు.

అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి " నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితినుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది.






కౌసల్య దగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి " 
ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జరగలేదు " అని రాముడిని అడిగింది. 

అప్పుడు రాముడు తలదించుకొని " సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు " అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ " మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి.......
ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను.

న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా ||
తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను " అని సీతమ్మ అనింది.

అప్పుడు రాముడు " సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను " అన్నాడు.

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ ||
అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు " అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.

అప్పుడు రాముడు " సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి " అన్నాడు.

కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని " నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది " అన్నాడు.

అప్పుడు రాముడు " నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు.

" నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను " అన్నాడు లక్ష్మణుడు.

నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.





రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలికా పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా, నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటే ఇదే కదా, నిన్నరాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చెయ్యవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు.

" రాముడు, సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రిగారికి నివేదించండి, నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకోని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను " అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా, దశరథుడు ఇలా అన్నాడు....

" సుమంత్రా, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు, రాముడికంటే ముందు, నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను " అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక, సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు.

లోపలికి వస్తున్న రామలక్ష్మణులని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి, మధ్యలోనే నేల మీద కళ్ళుతిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు.....

" తండ్రీ! మీరు కోరినట్టు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది, నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వికి ప్రభువులు, మాకు తండ్రి, అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి " అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు.

దశరథుడు రాముడిని పైకి లేపి " నన్ను కైక వంచించి నిగ్రహించి, ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలులేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో, అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామ " అని అన్నాడు.

" మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు, కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకి వెళతాను " అని రాముడన్నాడు.

అప్పుడు దశరథుడు " సరే రామ, నువ్వు అలాగే వెళ్ళిపో, కాని ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు, నీకు కావలసిన, కోరుకున్న భోగములన్నిటిని అనుభవించు, నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము " అన్నాడు.

అప్పుడు రాముడు " ఇవ్వాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు, కాని 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు, 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు. మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేనేమి ఆక్రోశంతో వెళ్ళడంలేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి, ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు " అన్నాడు.

ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్తితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కాని కైకేయ మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడినుంచి తొందరగా పంపించెయ్యి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో......

" ఛి, దుష్టురాల! మహా పాపి! పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింప పడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు, అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు, ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది, అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది.

నీ తల్లిగురించి మాకు తెలుసు. నీ తండ్రిగారికి సర్వప్రాణుల మనస్సులలోని విషయాలని, వాటి భాషనీ అర్ధం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది, దాని పేరు జ్రుంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల బాష అర్ధం అవుతుంది కనుక, ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు, అసలు ఆ చీమ ఏమందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు, దానిప్రకారం నేను నాకు అర్ధమైన విషయాలని బయటకు చెపితే, నా తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడావిడ, నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి, నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడా కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్నా విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్ధమవుతుంది, ఆమె మళ్ళి పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి అన్నాడు. అంత మంక్కుపట్టు పట్టిన స్త్రీ, నీ తల్లి. అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది " అని అన్నాడు.

అప్పుడు దశరథుడు " ఆ కైకేయకి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్రా. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి, 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధన రాశులని పంపండి, పట్టుచీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చెయ్యడానికి డేరాలు పంపండి, ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి, ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను " అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది....

" పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవ్వాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు.
రాజ్యం గత జనం సాధో పీత మణ్డాం సురాం ఇవ |
నిరాస్వాద్యతమం శూన్యం భరతః న అభిపత్స్యతే ||
నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు, మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరంలేదు " అని అనింది.

అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి " అసమంజసుడు పిల్లలని సరయు నదిలో తోసేసి, వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా, తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలికా? రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము " అని చెప్పాడు.

కైకేయ ఏమి మాట్లాడలేకపోయింది.

అప్పుడు దశరథుడు " ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా. కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు కాని, రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడుగలేదు, నేను నీకు అలా వరమూ ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి " అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు " నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు. నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను " అన్నాడు.

ఈ మాటలు వినగానే, కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో, అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ, పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది.

ఇది చూసిన వశిష్ఠుడు " పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు.
ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం ||
ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి. నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు, దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు, కాని రాముని వెనకాల సీతమ్మ పత్నిధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు.
యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి ||
నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడినుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి, కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు, అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది " అని వశిష్ఠుడు అన్నాడు.

సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక, కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు, సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూలేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు.

అప్పుడు దశరథుడు " కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది " అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.

రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు.

తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని " సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు " అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.

అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది " అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడే ".

అప్పుడు సీతమ్మ " మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, 
ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. 

న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా ||
వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు " అనింది.

తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది " నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు.

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||
లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో " అంది.





రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ' రామా! రామా! ' అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు 
ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. 

" నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు " అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.

అప్పుడు రాముడు " సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు " అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది.

మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీతీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు.

రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు " ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకొలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా " అన్నాడు.

" అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా " అని కౌసల్య అనింది.

అప్పుడు దశరథుడు " పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావ కౌసల్య " అని మళ్ళి మూర్చపోయాడు.

అటుపక్క తెలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి " వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడక పోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు " అన్నాడు.

అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి " ఏడి రాముడు ఏడి రాముడు " అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ.

రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు....
ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||
" ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు " అని వేడుకున్నాడు.

తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒకఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.

తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |
నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||
రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో( ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన( తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు......
" రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా " అన్నాడు.

గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |

అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |
పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||

అప్పుడు రాముడు " గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు " అన్నాడు.

ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా....
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |

శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||
" నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటే నేనెలా పడుకోగలను " అన్నాడు లక్ష్మణుడు.

మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, ' నేను ఏమి చెయ్యను ' అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు " నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు " అన్నాడు.

అప్పుడు సుమంత్రుడు " రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను " అన్నాడు.

" నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి " అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.

తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |
లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||
అప్పుడు రాముడు గుహుడిని పిలిచి " గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా " అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు " నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను " అన్నాడు.

తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి " ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు " అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో " అన్నాడు.

రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు " అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు.
న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |
ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||
నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా " అన్నాడు.

" లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు " అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.

మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకోని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు.

అప్పుడు రాముడు " మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము " అన్నాడు.

భారద్వాజుడు ఇలా అన్నాడు " ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూటపర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చెరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షిఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి " అని అన్నాడు.

భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలోవాస్తు హొమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు.

అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.




సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు " రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు " అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు......

" లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు " అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా " సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది " అన్నాడు.

అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు " ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ " అని సుమంత్రుడు అన్నాడు.

అప్పుడు కౌసల్య " ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దగ్గర ఉండను " అని అనింది.

కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు " నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను " అని రెండు చేతులతో నమస్కారం చేశాడు.

న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే ||
కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని " మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు " అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది.

తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు " నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను.

అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు.

తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి 'హా! కుమారా, హా! కుమారా' అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ 'హా! కుమారా' అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు.

ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, 'హా! కుమారా' అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా......రామా........." అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.

అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు.

దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీఅంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలో(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు.

మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః |

కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః ||
ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ |
వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం ||
ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యయనుడు, గౌతముడు, జాబాలిమొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు " మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ||
రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది " అని ఆ మహర్షులు అన్నారు.

అప్పుడు వశిష్ఠుడు " ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము " అని అన్నాడు.

తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచిపాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి,నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలముఅనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షముఅనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.




అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా, భరతుడు ఇలా చెప్పాడు " నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుంచి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు, తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి 
ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది, దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది " అని అన్నాడు. 

ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు.....
ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ |
అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః ||
" సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా.

ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచ హ ||
మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది, అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదుకదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా " అని అడిగాడు.

అప్పుడా దూతలు " నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని " చెప్పారు.

అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు( ఆయన అసలు పేరు ఆశ్వపతి) దగ్గరికి వెళ్ళి, తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్, ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానలన్నిటిని వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక, ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు.

ఆయన బయలుదేరి సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడినుంచి శల్య కర్తన నగరాన్ని, చైత్ర రథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే 
దేశానికి వచ్చాడు, కులింగ నదిని దాటాడు, తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడినుంచి భాగీరథీ నదిని దాటాడు, తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు, 
అక్కడినుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూథి అనే గ్రామాలు దాటాడు, తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి 
వచ్చాడు, తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు, అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు, 
అక్కడినుంచి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు, తరువాత కపివతీ అనే పట్టణానికి 
చేరుకున్నాడు, అక్కడినుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత స్థాణుమతీ అనే ఊరిని దాటాడు, 
తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గరినుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్ళు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు. 

అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు, అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని, గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని " చాలా సంతోషంగా గడిపావ, అందరూ ఆనందంగా ఉన్నారా, అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు " అని అనింది.

అప్పుడు భరతుడు " అమ్మ! నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని, నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది, నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా! తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా " అని అడిగాడు.

ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా,
యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః ||
" చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో, మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు " అనింది.
అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే, ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు.

అప్పుడా కైకేయ " ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా, గొప్ప గొప్ప సభలలో కుర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి, పైకి లేచి కూర్చో " అనింది.

అప్పుడు భరతుడు " అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా, రాముడికి పట్టభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మ, నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మ. అసలు దశరథ మారాజు ఎలా చనిపోయారు, చిట్టచివర చనిపోయేముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా " అన్నాడు.

" మీ నాన్న వెళ్ళిపోయేముందు, 'హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా' అంటూ చనిపోయాడురా, చనిపోతూ చనిపోతూ, ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా " అని కైకేయ చెప్పింది.

మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటే, మీ నాన్న పంపించేసాడు అని చెప్పింది.
అప్పుడు భరతుడు " నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని, రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడ, పరస్త్రీని దోష బుద్ధితో చూశాడ, పరకాంతని అనుభవించాడ, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడ, అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడ. ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదె, రాముడిని అడవులకు ఎందుకు పంపించారు, రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏమి జరిగిందో నాకు యధాతధంగా చెప్పు " అన్నాడు.

అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ " నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయ, పరకాంతని అనుభవించడం ఏమిటిరా, రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీతండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి, చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది " అనింది.

ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి " అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు, నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.

అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి " నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను " అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం " అని భరతుడు అన్నాడు.

ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలేదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఎడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి " రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు, ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు " అని అనింది.

భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని " అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావ. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహా పాపములు చేసిన వాడినవుదునుగాక " అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే " గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా, ఆ భార్యతో క్రిడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి, రుతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా, అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషం, లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటివాడికి, ఋషుల, పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానం కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది " అని అన్నాడు.

అప్పుడు కౌసల్య " నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడను " అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు.

తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి " నీ తండ్రి శరీరం తైల ద్రోణిలో ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు " అన్నారు.

అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.

అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి,
రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః |
అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ ||
" నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి " అన్నాడు.

ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు.

ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు " అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు, మూర్ఖురాలై మా అమ్మా కైకేయ రెండు వరాలు అడిగి ఉండవచ్చు, సత్యపాశములచేత బందింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు, కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు " అని వారు మాట్లాడుకుంటుండగా, అటువైపు నుంచి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కత్తే అని, అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీసారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా, అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది.

హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్ట చారిణీం |
యది మాం ధార్మికో రామః న అసూయేన్ మాతృ ఘాతకం ||
అప్పుడు భరతుడు " అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి. ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది, కాని ఎందుకు చంపడంలేదో తెలుసా, ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలెయ్యడం పెద్ద లెక్కా. దీన్ని చంపినా, స్త్రీని చంపిన వాళ్ళు అని, రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలెయ్యి " అన్నాడు.

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః |
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరాం ||
అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు, భరతుడి మాట విని, తన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు.

మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంత రాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు " నాయనా! నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో, అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము, కావున 
నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో " అన్నాడు.

అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి " నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు " అని, ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు.

తరువాత భరతుడు వశిష్ఠుడితో " నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ. నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టానయ్య, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవ్వాళ, ఈ రాజ్యం రాముడిది, నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు " అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు.

ఈ మాట విన్నవాళ్ళందరూ సంతోషపడిపోయి " సంతోషం భరతా, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం " అన్నారు.

అప్పుడు భరతుడు " నేను నిన్ననే ఆదేశించాను, కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి, రాముడి దర్శనం చేసుకోని, ఆయనని వెనక్కి తీసుకువద్దాము " అన్నాడు.





అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది.

అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి " భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముంది నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను " అన్నాడు.

అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో " భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి " అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.

యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి |
సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి ||
లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి "నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి " అని అడిగాడు.

అప్పుడు భరతుడు " నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను " అన్నాడు.

" సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది " అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.

అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో " ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక " అన్నాడు.

ఈ మాటలు విన్న గుహుడు " ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు " అని అన్నాడు.

ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు " రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ' నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ' అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటే, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు " అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.

అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.
మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః ||
అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.

తరువాత భరతుడు " ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను " అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.

మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలేదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు, అలా బ్రహ్మగారిచే ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు).

ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని 
ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. ( భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు)

అప్పుడు భారద్వాజుడు " మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది " అని అన్నాడు.

హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె |
మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ||
ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ " మహానుభావ! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావ అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి " అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.

అప్పుడు భారద్వాజుడు " నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక " అని ఆశీర్వదించిన పిమ్మట " నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు " అన్నాడు.

అప్పుడు భరతుడు " మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమి వద్దు 
అన్నాడు ". మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు.

అప్పుడు భారద్వాజుడు " అంత దూరంగా ఎందుకు పెట్టావయ్య, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను " అన్నాడు.

ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ |
ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం ||
ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్ |
తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ||
ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం |
భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ||
తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ | భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ||
అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి " ఇక్కడికి రాజకుమారులైన భరత 
శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక." ( రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)

విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు .

తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి " కుబేరా! నీ దగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవ!, నీ దగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి .

వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు( powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం( ఉసిరికాయలతో చేసిన ముద్ద ), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.

అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి " అని ప్రార్ధించాడు.

అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.

అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు .

అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికిలు " మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము " అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి.

మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.

తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి " వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావ " అన్నాడు.

అప్పుడు భరతుడు " సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య. వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి " అని అన్నాడు.
న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా |
రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి ||
దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం |
హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ ||
అప్పుడు భారద్వాజుడు " ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు " అన్నాడు.

భారద్వాజుడి మాటలు విన్న భరతుడు " సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి" అన్నాడు.

" అయితే నువ్వు ఇలా దక్షినాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గుర్రాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, 
మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు " అని భారద్వాజ మహర్షి చెప్పారు. 

అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ " సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు.

రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.






భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రముల పద ఘట్టనలని విన్న రాముడు " ఇంతకముందు ఎన్నడూ ఇలా లేదు, ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులుతీస్తున్నాయి. ఎవరో ఒక రాజో, లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది " అని లక్ష్మణుడిని పిలిచి, ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమి కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి, కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో....

అగ్నిం సమ్షమయతు ఆర్యహ్ సీతా చ భజతాం గుహాం |

సజ్యం కురుష్వ చాపం చ షరామ్హ్ చ కవచం తథా ||
" అన్నయ్యా! వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటిని తగ్గించేసెయ్యి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూణీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే, నీకు రాజ్యం దక్కకుండా చేసి, అరణ్యాలకి పంపించడమే కాకుండా, శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయ తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక, వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే, చూసి నేను సంతోషిస్తాను " అన్నాడు.

లక్ష్మణుడి మాటలను విన్న రాముడు " లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాల? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా?

ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ |

ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె ||
ధర్మము కాని, అర్థము కాని, కామము(కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటే, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడ? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము " అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి " నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని " అని రాముడు అన్నాడు.

ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు " అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు " అన్నాడు.

అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి " నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో పీడని సంకిస్తుంది " అన్నాడు.

ఇంతలో భరతుడు " ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు " అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

తం తు కృ్ఇష్ణ అజిన ధరం చీర వల్కల వాససం |

దదర్ష రామం ఆసీనం అభితహ్ పావక ఉపమం ||
సిమ్హ స్కంధం మహా బాహుం పుణ్డరీక నిభ ఈక్షణం |
పృ్ఇథివ్యాహ్ సగర అంతాయా భర్తారం ధర్మ చారిణం ||

గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్ధత కలిగినవాడైన రాముడు, ఈనాడు నార చీర కట్టుకొని, ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని, వీరాసనం వేసుకొని 

కూర్చునేసరికి, చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని, 
పరిగెత్తుకుంటూ వస్తూ, "రామా" అని ఒకసారి పిలిచి, శోకభారంతో నేల మీద పడిపోయాడు.

అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.

ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి " ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా " అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.

అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి " నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా.

పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.

మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా " అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.

రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |

కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||
రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు.

ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు.

సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |

భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||
సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |
అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||
వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు " అన్నాడు.

(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)

అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు ( తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి).

అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు " అన్నాడు.

" మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు " అని రాముడు అన్నాడు.

ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ( రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది.

అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి " అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంతమాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు " అన్నాడు.

అప్పుడు రాముడు " ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి " అన్నాడు.

అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు " అన్నాడు.

రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు.

ఈ మాటలు విన్న రాముడు " దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి.

త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |

వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం ||
నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో " అన్నాడు.





అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి " నేను ఇందాకటినుంచి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని అయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని, ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్దింగా గర్భం ఏర్పడింది. అందులోనుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమి ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నార. వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి. వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మము అంటావేంటి. అసలు ఇవన్నీ ఎందుకోచ్చాయో నేను చెప్పనా రామ, ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు, అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే, వాడి ఆకలి తీరదు కాని, చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా, ఎవడు చెప్పాడు ఇవన్నీ. హాయిగా ఉన్న దానిని అనుభవించు " అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో " జాబాలి! నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే, అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్ని సత్యాలు కావు, మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహా పురుషులు, 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్థలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే, సూక్ష్మ శరీరంతో మూడు తరాల వరకు పితృ లోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని( దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు, నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు), ప్రవర్తన తెలియనివాడిని,
సత్యం ఎవ ఈష్వరొ లొకె సత్యం పద్మా సమాష్రితా |
సత్య మూలాని సర్వాణి సత్యాన్ న అస్తి పరం పదం ||
ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో, అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీవంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్య దశరథ మహారాజు. నాకు ఇవ్వాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది " అన్నాడు.

ఈ మాటలు విన్న జాబాలి గజగజ ఒణికిపోతూ " నేను వేదాన్ని తిరస్కరించినవాడిని, నమ్మని వాడిని కాదు రామ, భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను " అన్నాడు.

అప్పుడు వశిష్ఠుడు వచ్చి, బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి " ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు, తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో, తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్ళి ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యమునుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు, అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో " అన్నాడు.

అప్పుడు రాముడు " మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామ! నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు, నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని, నేను ఇచ్చిన వరం ఎందుకూ పనికిరాకుండా పోయందని నా తండ్రిగారు బాధ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనే వాడు బయటకి వచ్చేది, ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనే వాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు, అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించాలేను " అన్నాడు.

అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి " దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి, నేను ముఖం మీద బట్ట వేసుకొని, ఏది చూడకుండా, రాముడికి ఎదురుగా కూర్చుంటాను " అన్నాడు (పూర్వకాలంలో రాజు తప్పుచేస్తే, ధర్మం తప్పితే, బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియచెయ్యడం కోసమని). అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు, వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు.

" నువ్వు నన్ను ఇలా నిర్బందించచ్చా భరతా, నేను ఏ తప్పు చేసానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు. ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి, అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో " అన్నాడు రాముడు.

అప్పుడు భరతుడు లేచి, ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి " రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను, లేకపోతే నా బదులు రాముడు రాజ్య పాలనం చేస్తాడు, నేను అరణ్యాలలో ఉంటాను " అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు నవ్వి " భరతా! అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్య పాలన చేస్తాను. అప్పటివరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు " అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరికి వచ్చి, రాముడు చెప్పిన్నట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.

అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు.

" చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు కాని, నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను " అని రాముడన్నాడు.

ఈ సమయంలో వశిష్ఠుడు లేచి " అయితే రామ, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు " అని చెప్పి, తాను తీసోకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి " భరతా! ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి " అన్నాడు.(వశిష్ఠుడు త్రికాలవేది, ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు).

భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి, వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీద ఎక్కి దిగాడు. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక, 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే, నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. 
తతహ్ షిరసి కృ్ఇత్వా తు పాదుకె భరతహ్ తదా |
ఆరురొహ రథం హృ్ఇష్టహ్ షత్రుఘ్నెన సమన్వితహ్ ||
అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి, తాను ఏ పని చేసినా, ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు.

తరువాత రాముడి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి " ఇక్కడ దగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి, నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు, అందుకని మేము ఇక్కడ ఉండకుండా, దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా " అని అడిగారు.

ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు, ఇక్కడే ఉంటే నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం సౌచాన్ని కోల్పోయింది, అని రాముడు తన మనస్సులో అనుకొని, సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు.

అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి " నా భార్య పేరు అనసూయ( కర్దమ ప్రజాపతి - దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది, దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది, ప్రజలందరికి అన్నం పెట్టింది, ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది, కనుక ఆమె దగ్గరికి ఒకసారి పంపించు " అని అన్నాడు.

తన దగ్గరికి వచ్చిన సీతమ్మని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అనింది " సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు " అని అడిగింది.

అప్పుడు సీతమ్మ " నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ " అనింది.

సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ " సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు, ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు " అనింది.

అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి " సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు " అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు.

తరువాత అనసూయ సీతమ్మని తన దగ్గర కూర్చోపెట్టుకొని " నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది, నాకు నీ కళ్యాణం గురించి చెప్పు" అనింది.

అప్పుడు సీతమ్మ " జనక మహారాజు భూమిని దున్నుతుంటే, నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీతా అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక, శివ ధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివ ధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి, నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి, నీళ్ళు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివ ధనుస్సుని విరిచాను, నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే, మీరు
కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో, నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్థాంగిని అయ్యాను " అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది.

తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటువెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడుగగా, ఆయన " ఇక్కడ రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలోవెళ్ళండి " అని, ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దగ్గర, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, సీతారామలక్ష్మణులు ఆ దారిలో తమ ప్రయాణాన్ని సాగించారు.

మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో, అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు.




రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు. 
పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః |
తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం |
బ్రహ్మ విద్భిః మహా భాగైః బ్రాహ్మణైః ఉపశోభితం ||
ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు, అందరూ వేదం చదువుకున్నారు, ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేద ధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే, ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమము దగ్గర యజ్ఞములలో వాడే సృక్కు, స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి, అలంకారం కోసం సిద్ధం చెయ్యబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి.

రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం |
దదృశుర్ విస్మిత ఆకారా రామస్య వన వాసినః ||
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్ అనిమిషైర్ ఇవ |
ఆశ్చర్య భూతాన్ దదృశుః సర్వే తే వన వాసినః ||
ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాక, రాముడు తన ధనుస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామలక్ష్మణులను చూసిన ఆ ఋషులు, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మతేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు.

అప్పుడా ఋషులు " మహానుభావ! మేము అందరమూ నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి. ఇంద్రుడి యొక్క అంశలో నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్ళని, నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేనివాడికి రాజు బలం రక్ష, బలం ఉందని చెలరేగిపోయేవాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము, మా తపస్సులో రాజుకి ఆరవ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు, అందుకని రామ నువ్వు మమ్మల్ని ఆ రాక్షసులనుంచి రక్షించాలి " అని అన్నారు.

అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్ధనలని స్వీకరించి, వారు ఇచ్చిన అర్ఘ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడినుంచి బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని భుజానికి ధరించినవాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, వొంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన వొళ్ళో కుర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.

అధర్మ చారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ |
అహం వనం ఇదం దుర్గం విరాఘో నామ రాక్షసః ||
చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||
" మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్న వాళ్ళు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు(రాధ్ అంటే ఆనందం, విరాధ్ అంటే ఆనందానికి వ్యతిరేకం) అంటారు, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూశావా లక్ష్మణా, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో, నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా, నా కాళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళి, తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు, నాకు చాలా దుఃఖంగా ఉంది " అని, ఆ విరాధుడి వైపు చూసి " మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు " అని రాముడు అన్నాడు.

అప్పుడా విరాధుడు " నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శతహ్రద, నేను ఈ అరణ్యంలో 
తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను " అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు. 

అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు, లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందకి పడేసారు, అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్య తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు.

అప్పుడా విరాధుడు " నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను, అందువలన నన్ను అస్త్ర-శస్త్రములు ఏమి చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది, నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కాని, నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళి స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పుడ్చేసి సంహరించండి. ఇక్కడినుంచి ఒకటిన్నర యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది " అని విరాధుడు రాముడితో అన్నాడు.

తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి, మట్టితో పుడ్చేసి, శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు.

వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే, వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది, సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డార, అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది, ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది, వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.

ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు, ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చె ఇంద్రా, అని పిలుస్తాము కదా, అదిగొ ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు, అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను " అన్నాడు.

అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు.............

ఇహ ఉపయాతి అసౌ రామో యావన్ మాం న అభిభాషతే |
నిష్ఠాం నయత తావత్ తు తతో మా ద్రష్టుం అర్హతి ||
" రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది, అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి " అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని, లక్ష్మణుడిని తీసుకొని శరభంగ ముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు.

" రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్నిగెలిచాను, అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు " అని శరభంగుడు అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు " మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను " అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు " ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామ! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం( 
ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది) అయిపోయింది, కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను " అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. 

తస్య రోమాణి కేశాం చ తదా వహ్నిః మహాత్మనః |
జీర్ణం త్వచం తద్ అస్థీని యత్ చ మాంసం చ శోణితం ||
ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు.

బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి " మహానుభావ! శరభంగ, స్వాగతం, సుస్వాగతం " అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.






శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు (విఖనస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు), చెట్లనుంచి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్టుమీదనే ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు, ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు.

శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి " రామ! ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపఃశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కాని మేము జితఃక్రోధులం, కోపాన్ని జయించినవాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపఃశక్తిని మాకోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న పిండంలాంటి వాళ్ళము, మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు, నువ్వు క్షత్రియుడవి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం, నీ దగ్గర ధర్మం పుష్కలంగా ఉంది, నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు, సత్యధర్మములను రెండిటినీ అనుష్టానము చెయ్యడము తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు, రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ.

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావిత ఆత్మనాం |


హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే ||


ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చిచూడు రామ, చిత్రకూట పర్వతాల మీద, దండకారణ్యంలో, మందాకినీ నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేసారు. అందుకని నీ ముందు నిలబడి, రెండు చేతులతో నీకు దండం పెట్టి, నీకు శరణాగతి చేస్తున్నాము రామ, మమ్మల్ని రక్షిస్తావ?" అని ఆ ఋషులు రాముడిని అడిగారు.

ఆ ఋషుల యొక్క ప్రార్ధనలని విన్న రాముడు " మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను, మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు " అన్నాడు.

తరువాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు.

వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణసహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దగ్గర కూర్చుని " మహాత్మా! నన్ను రాముడు అంటారు, ఒకసారి మీరు నన్ను చూసి, నాతో మాట్లాడవలసింది అని అభ్యర్దిస్తున్నాను " అని అన్నాడు.

కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు " రామ! దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత నేను 
లోకములన్నిటిని గెలిచాను కనుక నన్ను ఊర్ధలోకములకు తీసుకువెళతాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని, ఆయనకి ఆతిధ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామ " అన్నాడు. 


శరభంగ మహర్షి చెపినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు. 

అప్పుడు రాముడు " మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి " అన్నాడు. 

"అయితే ఇక్కడ దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చుసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను " అని సుతీక్ష్ణుడు అన్నాడు.

" నాకు కూడా ఆ ఆశ్రమాలన్నిటిని చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నిటిని చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను " అని రాముడు అన్నాడు.

ఆ రోజూ రాత్రికి సుతీక్ష్ణుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి, సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష్ణ మహర్షి " రామ! నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యదేచ్ఛగా ఆచరించు, ఇక్కడ ఏవిధమైన ప్రమాదము ఉండదు, కాని ఇక్కడికి మృగములు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు " అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు " మృగాలని చూస్తే ధనుస్సు పట్టుకోవడం నా అలవాటు, ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే, ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణ ప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగచ్చు, అందువలన బాణ ప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి, అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించికోడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకొని వస్తాను " అన్నాడు.

" అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకొని మళ్ళి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను " అని సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు.

సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది " నేను పెద్దల దగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే..... 

తృతీయం యద్ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం |


ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు, అప్పుడా తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, తాపసులని హింసించే రాక్షసులని ఇకనుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి, కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శత్రుత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి.......

పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ' అయ్యా! నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దగ్గర ఉంచండి' అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు. 

మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది, తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు, కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? 

మీరు నాతో ఒక మాట అనొచ్చు, ' నేను రాజుని కాకపోవచ్చు, కాని నేను ఒక క్షత్రియుడిని, అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు' అని. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పనేమో. మీ తమ్ముడితో ఆలోచించి, ఒక మంచి నిర్ణయానికి రండి " అని సీతమ్మ రాముడితో అనింది.

సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు " సీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు. 


తే చ ఆర్తా దణ్డకారణ్యే మునయః సంశిత వ్రతాః |

మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యాః శరణం గతాః ||


నేనేమి వాళ్ళని అడగలేదు, వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా. నేను క్షత్రియుడని కనుక వాళ్ళకి కష్టం వస్తే, ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు, నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశారు, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంతేకాని ఎట్టి పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీతా " అని రాముడు అన్నాడు.


ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి " మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది" అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి " ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏంటి సంగతి " అని అడిగారు.


ఇదం పంచ అప్సరో నామ తటాకం సార్వ కాలికం |

నిర్మితం తపసా రామ మునినా మాణ్డకర్ణినా ||


అప్పుడా ధర్మభృత్ " ఈ సరోవరాన్ని మాణ్డకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకొని, ఆయన తపస్సుని భగ్నం చెయ్యడానికి అయిదుగురు అప్సరసలని పంపారు. అప్పుడా మాణ్డకర్ణి ముని ఆ అప్సరసలకి వసుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపఃశక్తితో యవ్వనాన్ని పొంది ఈ అయిదుగురితో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటకి వినబడుతున్నాయి రామ " అని అన్నాడు.


ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడినుంచి ముందుకి పయనమయ్యాడు.
(ఈ మాణ్డకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే, మాణ్డకర్ణి మహర్షి దగ్గరికి వచ్చిన ఆ అయిదుగురు 
అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు. తన ఇంద్రియాలకి లొంగినవాడై, తను ఇప్పటిదాకా సంపాదించిన తపఃశక్తిని సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాడు)

తాను చూసినటువంటి ఆశ్రమములలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొకదానిలో 1 సంవత్సరము, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంత కాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు. 

అప్పుడు రాముడు " అయ్యా! 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళి రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడొ ఉందని విన్నాను, కాని ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు, అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను " అని అన్నాడు.

అప్పుడా సుతీక్ష్ణుడు " రామ! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత(అంటే అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు " అన్నాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే..............పూర్వం ఇక్కడ ఇల్వలుడు, 
వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ' అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం 
పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ' అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ' వాతాపి! రా........' అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.


ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి 'వాతాపి! రా.....' అన్నాడు. 

కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః | 


భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||


" నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా " అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు. 

ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా " అని రాముడు అన్నాడు.

ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు, కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడుగగా " అదిగొ మీకు కనపడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతోంది " అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పరు.

అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి( అంటే ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి, తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివ స్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి, అగస్త్యుడు శివుడిని పూజించేవాడు). ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కాని, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కాని, వంచన చేసేవాడు కాని, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కాని, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కాని ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జరగదు. 

సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడా చూసిన తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు మొదలైనవాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తార " అని కబురు చెయ్యి అన్నాడు.

లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా " నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా, నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు " అని అగస్త్యుడు అన్నాడు. 

అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు. 

ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |



జగ్రాహ ఆపతత్ తస్య పాదౌ చ రఘునందన ||

అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |

సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||



సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. 

అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు " నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు. 

రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను " అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు 
ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. 


" స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము " అని రాముడు అడుగగా, " నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో " అన్నారు.

సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు " నువ్వు ఎవరు " అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది.......

" నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి " మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి " అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు. 

అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.






కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి.

అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.

రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే " అని అన్నాడు ఆ జటాయువు.

ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.

రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు " అన్నాడు.

పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||

అప్పుడు లక్ష్మణుడు " స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి " లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు " అన్నాడు.

ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు, వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు, దానిమీద అడ్డుకర్రలు వేశాడు, వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసెటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని " అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను " అని అన్నాడు. ( ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు, అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)

ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |
ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||
ఆ పర్ణశాలని చూసిన రాముడు " ఏమి పని చేశావయ్యా, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా " అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని " లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని " అన్నాడు.

అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగ కాలం గడపసాగారు.

కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలో మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.

నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |
ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే......సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి " అన్నాడు.

" లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది " అని రాముడన్నాడు.

కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |
కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||
సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు.

అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ( చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తెజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది.

రాముడిని చూస్తే ' అబ్బ ఎంత బావున్నాడో ' అంటారు, ఆమెని చూస్తే ' బాబోయి అలా ఉందేంటి ' అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది, ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళి చూడాలనిపించే రూపం రాముడిది, పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వాళ్ళు భయపడతారు.

ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి " నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు " అని అడిగింది.

అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు " నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు? " అని రాముడు అన్నాడు.

అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||
రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||
అప్పుడు శూర్పణఖ " నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు " అని సీతమ్మ వైపు చూసి " ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు" అనింది.

విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు " నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు " అన్నాడు.

అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి " నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు " అని పరిహాసం ఆడాడు.

లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు " ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు.

అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది " ఇక్కడికి దగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా " అనింది.

" అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను " అని ఖరుడు అన్నాడు.




తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి " మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది " అన్నాడు.

తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను " అన్నాడు.

ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.

ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ " పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో " అనింది.

ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి " నేను ఇప్పుడే బయలుదేరతాను, నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కాని యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు " అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.

ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి, ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు.

ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.

అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి, భూమి ఒక్కసారి కంపించింది, అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది, అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటే గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటే, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను.

తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |
గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||
అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో 'సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో' అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో " అన్నాడు.

అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.

ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.

రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలో నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.

దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.

అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడాయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు, ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుంచి రక్తం కారింది.

అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు " వాడు మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాసం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను " అన్నాడు.

ఆ మాటలకి ఆగ్రహించిన ఖరుడు యమపాశం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించగా, ఆ గద మార్గమధ్యలోనే తుత్తునియలు అయిపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ ఖరుడి ధ్వజం, గుర్రాలు, సారధి పడిపోయారు. ఆ బాణాలు ఖరుడి గుండెల్లో దిగేసరికి, ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో, అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి, దాన్ని రాముడి మీద వెయ్యబోగా, రాముడు ఆ చెట్టుని నారాచ బాణములతో ముక్కలు చేశాడు. అప్పుడా ఖరుడు రాముడి మీద పడబోగా, ఆయన బాణం పెట్టి కొట్టగానె, ఖరుడు భూమి మీద పడి మరణించాడు.

అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |
చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం |
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||
రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది.

అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడివంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.






రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు " అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు " అన్నాడు.

అప్పుడు అకంపనుడు " రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటే, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు " అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.

" అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను " అని రావణాసురుడు అన్నాడు.

అప్పుడు అకంపనుడు " మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో " అన్నాడు.

రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి" నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి " అని అడిగాడు.

ఈ మాటలు విన్న మారీచుడు " నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు " అన్నాడు.

" నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను " అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.

( పైన జరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించార, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించార? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కాని ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడ? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడ? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కాని అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా ప్రకటించారు. అవునా, కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి.) ఇక కథ ప్రకారంగా చూస్తే....................

అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకంవస్తాడు.

దేవ అసుర విమర్దేషు వజ్ర అశని కృత వ్రణం |

ఐరావత విషాణ అగ్రైః ఉత్కృష్ట కిణ వక్షసం ||
వింశత్ భుజం దశ గ్రీవం దర్శనీయ పరిచ్ఛదం |



విశాల వక్షసం వీరం రాజ లక్ష్మణ లక్షితం ||

దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చెయ్యడం వలన, ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండలములు పెట్టుకున్నాడు, విశాలమైన భుజాలతో ఉన్నాడు, తెల్లటి పళ్ళతో, పర్వతమంటి నోటితో ఉన్నాడు. శ్రీమహా విష్ణువు యొక్క చక్రము చేత కొట్టబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి, అలాగే మిగిలిన దేవతల ఆయుధముల దెబ్బలు వాడి ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయతిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటే, వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం.

అలాగే ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం తెలుసు, ఆ అస్త్రములను ఉపసంహరించడం కూడా తెలుసు. ఎవరన్నా యజ్ఞాలు చేస్తుంటే, తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు, అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు( కుబేరుడు స్వయంగా రావణుడికి అన్నయ్య. కాకపోతే కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే, రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. అలాగే స్వర్గలోకంలోని నందన వనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.

రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు 
ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా........



దేవ దానవ గధర్వ పిశాచ పతగ ఉరగైః |

అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాద్ ఋతే ||



" నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు " అని అడిగాడు, కాని రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా, అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలములయందు దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. ( ఒకసారి రావణుడు కైలాశ పర్వతాన్ని లేపాలని చూస్తే, పరమశివుడు తన బొటను వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండడంచేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసేవిధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.)

రావణం సర్వ భూతానాం సర్వ లోక భయావహం |

 రాక్షసీ భ్రాతరం క్రూరం సా దదర్శ మహాబలం ||

రావణాసురుడు సర్వ లోకములకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా, శూర్పణఖ భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి "నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములని అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు, సరైన గూఢచారులని నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్టు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దెగ్గరకి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోరా?, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా?, చెప్పినా నువ్వు బాధపడవా?. రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒకసారి కాని నువ్వు రాజ్యభ్రష్టుడివి అయ్యావంటే, అవకాసం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా, ప్రకాశించడం మానేస్తుంది.

నువ్వు దండకారణ్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. కాని, ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది " అనింది.

శూర్పణఖ మాటలు విన్న రావణుడు " అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు " అన్నాడు.

దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |

కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||

అప్పుడా శూర్పణఖ " రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.

రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |

ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.

నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటే, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు " అనింది.

శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి " ఇక మీరు బయలుదేరండి " అన్నాడు.